నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్‎కు వస్తే జైలుకే.. 22ఏ నిషేధిత జాబితాపై ఇక గందరగోళమే లేదు

నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్‎కు వస్తే జైలుకే.. 22ఏ నిషేధిత జాబితాపై ఇక గందరగోళమే లేదు
  • అలాంటి ఇద్దరిపై ఇప్పటికే కేసులు పెట్టాం
  • 22ఏ నిషేధిత జాబితాపై ఇక గందరగోళమే లేదు
  • ఆన్​లైన్​లో జీవోలు, ప్రొసీడింగ్స్ అప్​లోడ్
  • పొరపాటుతోనే నిషేధిత జాబితాలోకి సీఎం ఇల్లు 
  • ‘టోల్ ఫ్రీ’కి వచ్చిన 980 ఫిర్యాదుల పరిష్కారం
  • గత ప్రభుత్వ హయాంలోని 800 ఎకరాల వివాదాస్పద భూములపై విచారణకు సిద్ధమా?
  • ప్రతిపక్షాలకు రెవెన్యూ మంత్రి పొంగులేటి సవాల్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు ఆస్తులుగా మార్చేందుకు దొంగ పత్రాలతో వస్తే ఎంతటివారినైనా జైలుకు పంపుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ సంతకంతో సృష్టించిన నకిలీ మెమోతో ఒకరు, యూఎల్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పేరిట మరో బోగస్ పత్రంతో ఇంకొకరు రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారని.. ఆ ఇద్దరిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

నకిలీ జీవోలు, దొంగ పత్రాలతో ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కొందరు మోసగాళ్లు కుట్రలు చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితాకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు, గందరగోళం లేకుండా జీవోలు, మార్గదర్శకాలను, రెగ్యులరైజ్ అయిన భూముల అన్ని వివరాలను అప్​డేట్ చేసి వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో పొందుపర్చామని మంత్రి తెలిపారు.

ప్రైవేటు ఆస్తులు, సక్రమంగా ఏ డాక్యుమెంట్‌‌ను అధికారులు రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపలేరని స్పష్టం చేశారు. సోమవారం సెక్రటేరియెట్‌‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇక ‘అబద్ధాల రావు’ ప్రచారం చేస్తున్నట్లుగా సీఎం రేవంత్‌‌రెడ్డి ప్లాట్ నిషేధిత లిస్ట్‌‌లో ఉందనడం పచ్చి అబద్ధమని.. సర్వే నంబర్ 403లోని 1,288 ఎకరాల భూమిలో కేవలం 2 ప్లాట్లకు మాత్రమే వివాదం ఉండగా, గత ప్రభుత్వంలో పొరపాటున మొత్తం సర్వే నంబర్‌‌ను నిషేధిత జాబితాలో చేర్చారని, దాన్ని ఇప్పటికే రెక్టిఫై చేశామని తెలిపారు. ప్రైవేటు భూముల జోలికి ప్రభుత్వం వెళ్లదని, ప్రభుత్వ భూములను అంగుళం కూడా ఆక్రమణకు గురికాకుండా కాపాడుతూ సామాన్యులకు పూర్తి రక్షణ కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.

రాజకీయ లబ్ధికే ప్రతిపక్షాల కృత్రిమ భయాందోళనలు

దశాబ్దాలుగా నడుస్తున్న సీఎస్-7, సీఎస్-14 భూముల వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ పరిధిలో ఉందని, కోర్టు ఆదేశాలకు లోబడి డాక్యుమెంట్లలో కేసు నంబర్లను స్పష్టంగా పొందుపరుస్తూ మాత్రమే రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నామని శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. 2017లో గత పాలకుల అండదండలతో ఓ ప్రముఖ మీడియా సంస్థ ఎండీకి ఎస్-క్లాస్ బెంజ్ కారు ముట్టజెప్పి 5-6 డాక్యుమెంట్ల ద్వారా సుమారు 800 ఎకరాలకు పైగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని, నాడు పీసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుత సీఎం రేవంత్‌‌రెడ్డి దీనిపై పోరాడటంతో నాటి ప్రభుత్వం అయిష్టంగానే డాక్యుమెంట్లలో కేసు పెండింగ్ అని నోట్ చేసి ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేసిందని గుర్తుచేశారు. గతంలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు విపక్షాలు యాగీ చేస్తూ ‘జనతా గ్యారేజ్, ఆ గ్యారేజ్, ఈ గ్యారేజ్’ అంటూ అవాకులు చవాకులు పేలుతున్నాయన్నారు. రాజకీయ స్వలాభం కోసమే ప్రతిపక్షాలు ప్రజల్లో కృత్రిమ భయాందోళనలు సృష్టిస్తున్నాయన్నారు.

నిషేధిత జాబితా పేరుతో రిజిస్ట్రేషన్లు ఆపట్లేదు..

నిషేధిత జాబితా పేరుతో రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం లేదని మంత్రి తెలిపారు. ‘‘స్లాట్‌‌ బుక్‌‌ చేసుకున్న వారిలో 98 శాతం రిజిస్ట్రేషన్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తయ్యాయి. గతంలో రిలాక్సేషన్ పొందిన వాటిని వెంటనే క్లియర్ చేశాం. దేవాదాయ, భూదాన్ వంటి వివాదాస్పద భూములున్న చోట మాత్రమే రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఉదాహరణకు ఈ రోజు 302 స్లాట్లు బుక్ అయితే, అందులో నిషేధిత కేటగిరీకి చెందిన 12– -13 మాత్రమే తిరస్కరించాం. స్లాట్ బుక్ చేసి, ఫీజులు కట్టి వివిధ కారణాలతో రిజిస్ట్రేషన్ కాని వారికి ఈ వీకెండ్ లోపే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే నగదును రీఫండ్ చేస్తాం’’ అని స్పష్టం చేశారు.

 రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ జీవోలు, మార్గదర్శకాలను సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల వెబ్‌‌సైట్లలో ప్రజలందరికీ అందుబాటులో ఉంచామన్నారు. ప్రజల సందేహాల నివృత్తికి ఈ నెల 17న ప్రకటించి 18 నుంచి ప్రారంభించిన టోల్‌‌ఫ్రీ నంబర్‌‌ను తొలుత 2 లైన్లతో మొదలుపెట్టి, రద్దీ దృష్ట్యా 20 లైన్లకు పెంచామని తెలిపారు. 18న 116, 19న 168, 20న 200, 21న 369, 22న 309 కాల్స్ చొప్పున మొత్తం 1,162 కాల్స్ రాగా.. రిపీటెడ్ కాల్స్ తీసేస్తే 980 ప్రత్యేక కాల్స్ (వ్యవసాయం-547, వ్యవసాయేతర-433) నమోదయ్యాయన్నారు. 

జిల్లా వారీగా రంగారెడ్డి నుంచి 258, మేడ్చల్‌‌ 149, సంగారెడ్డి 82, కామారెడ్డి 44, యాదాద్రి భువనగిరి 40, సిద్దిపేట నుంచి 35 కాల్స్ వచ్చాయని.. వాటిని ఎప్పటికప్పుడు కలెక్టర్లకు పంపుతూ, రెవెన్యూ సిబ్బంది 24 గంటలూ పనిచేస్తూ జెన్యూన్ సమస్యలను ఫాస్ట్ ట్రాక్ విధానంలో 24 నుంచి 36 గంటల్లోనే పరిష్కరిస్తోందని వివరించారు. వివిధ ప్రాంతాల్లో నిషేధిత జాబితాపై ఉన్న క్షేత్రస్థాయి వాస్తవాలను మంత్రి వివరించారు. రంగారెడ్డి జిల్లా నాదర్‌‌గుల్‌‌లోని సర్వే నంబర్లు 773, 775, 776, 786లలో యూఎల్సీ క్లియరెన్స్ పొందిన గ్రీన్ మార్క్ స్థలాలకు రిజిస్ట్రేషన్లు సాఫీగా జరుగుతున్నాయని, యూఎల్సీ అప్లై చేసుకోని రెడ్ మార్క్ భూములను మాత్రమే హోల్డ్ చేశామని, దీనిపై త్వరలోనే సమగ్ర ప్రభుత్వ పాలసీని తీసుకొస్తామని ప్రకటించారు. 

మేడ్చల్-మల్కాజ్‌‌గిరి హెడ్‌‌క్వార్టర్స్ పరిధిలోని సర్వే నంబర్లు 68/1, 70/1, 71లలోనూ యూఎల్సీ క్లియర్ కాని రెడ్ మార్క్ భూములను మాత్రమే నిలిపివేశామన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో సర్వే నంబర్ 173 ప్రైవేటు భూమి కాగా, పక్కనే ఉన్న 172 ప్రభుత్వ భూమి అని.. ప్రైవేటు సర్వే నంబర్ 173లో లేఅవుట్ అనుమతులు తీసుకుని, వాస్తవంగా 172 ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేసినందువల్లే అధికారులు రిజిస్ట్రేషన్లు అడ్డుకున్నారని వెల్లడించారు. మేడ్చల్ జిల్లా పర్వతాపూర్ పరిధిలోని 2000–-3000 ఎకరాల రెవెన్యూ, హ్యామ్‌‌లెట్ గ్రామాల సమస్యలపైనా పూర్తి అవగాహనతో ఉన్నామన్నారు.